తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలపై రఘురామ్ రాజన్ సూచనలు.

తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలపై రఘురామ్ రాజన్ సూచనలు.

హైదరాబాద్: నైపుణ్యాల అభివృద్ధి ద్వారా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మానవ వనరుల అభివృద్ధికి పోషకాహార లోప సమస్యను పరిష్కరించడం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

 

 

తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

 

 

ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, సీఎంఓ ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, స్పెషల్ సీఎస్‌లు జయేశ్ రంజన్, వాణి ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాజన్ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. స్టార్టప్‌లకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. విద్యా రంగంలో కృత్రిమ మేధ (AI)ను సమన్వయం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను కోరారు. రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

 

 

AI సరైన వినియోగం సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని రాజన్ పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు తమిళనాడు తరహా పరిశ్రమ విధానాన్ని అనుసరించాలని సూచించారు. డేటా సెంటర్లకు అధిక విద్యుత్, నీటి అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. త్వరలో తాను హైదరాబాద్‌ను సందర్శిస్తానని రాజన్ పేర్కొన్నారు.

 

 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన భూమి, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భవిష్యత్ విద్యుత్ అవసరాల కోసం ఉత్పత్తి పెంపు చేపడుతున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ వంటి మౌలిక వసతులు ఉన్నాయని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, పరిశ్రమల క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

 

 

అలాగే “CURE, PURE, RARE” మోడల్ ఆధారంగా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. యువత నైపుణ్యాల కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ITIలను ATCs‌గా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

 

పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనుకూలంగా ఉందని, ఫార్మా, ఐటీ, డేటా సెంటర్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.