నల్గొండలో పడ్డీ కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీ.
నల్గొండ ప్రతినిధి : రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ధాన్యం అన్‌లోడింగ్, వాహనాల రొటేషన్, రవాణా ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. రైస్ మిల్లుల్లో అన్‌లోడింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అదనపు లారీలు, హమాలీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పెద్దకాపర్తి కేంద్రంలో ఇప్పటివరకు 25 వేల క్వింటాళ్ల ధాన్యం రాగా, అందులో 7 వేల క్వింటాళ్లు కొనుగోలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా నిల్వలో ఉందని పేర్కొన్నారు. ఈ కేంద్రానికి అదనంగా 10 నుంచి 20 లారీలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ వివరించారు.

ట్యాబ్ ఎంట్రీలను శాతం 100 పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. గన్నీ బ్యాగులు, తార్పాలిన్ల లభ్యతపై సమీక్షించి అవసరమైన చోట అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
తర్వాత వట్టిమర్తి వద్ద సిద్ధార్థ రైస్ ఇండస్ట్రీస్‌ను సందర్శించిన ఆయన, అక్కడి అన్‌లోడింగ్, వాహనాల రొటేషన్‌ను పెంచాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. మిల్లుల్లో స్థలాభావం ఉంటే మధ్యంతర గోదాములకు ధాన్యాన్ని తరలించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సివిల్ సప్లైస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
