రైతుల అభివృద్ధే లక్ష్యం – ఘనంగా రైతు వారోత్సవాలు, సన్మాన కార్యక్రమం.
బోధన్ ప్రతినిధి రాహుల్:- నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. వ్యవసాయ శాఖ మరియు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు సన్మానం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్, వైస్ చైర్మన్ వసంత్ ముఖ్య అతిథులుగా హాజరై రైతులను శాలువాలతో సత్కరించారు. బోధన్ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు ఉదిమిరి లక్ష్మణ్, సాలూరు మాజీ జడ్పీటీసీ సభ్యుడు శంకర్, అల్లే సాయన్న తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ శంకర్ మాట్లాడుతూ, రైతులే దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా లాభాలు సాధ్యమవుతాయని తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రైతుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం రైతుల్లో నూతనోత్సాహాన్ని నింపుతూ, వ్యవసాయ అభివృద్ధికి దిశానిర్దేశం చేసింది.
