బోధన్ ప్రతినిధి రాహుల్ :- బీడీ కార్మికుల వేతనాల పెంపుదలపై బీడీ యజమానుల ప్రతినిధులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ తెలిపారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్‌లోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో జరిగిన సమావేశంలో ది తెలంగాణ బీడీ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హితేంద్రభాయ్ ఉపాధ్యాయ, రష్మీకాంత్ పటేల్, రమణ్ భాయ్ మరియు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం. నరేందర్‌తో పాటు ఇతర కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో వేతనాల పెంపుపై ఒప్పందం కుదిరిందన్నారు.
ఒప్పందం ప్రకారం బీడీ ప్యాకర్లకు నెలకు రూ.4,500, సాటర్స్, గంపవాలా, బట్టివాలా, క్లర్క్, మునీమ్‌లకు నెలకు రూ.2,200 వేతన పెంపు కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే బీడీలు చుట్టే కార్మికులకు వెయ్యి బీడీలకు రూ.6 చొప్పున అదనంగా పెంపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.