Telangana newsMay 15, 2026
Telangana news

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహణ.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  May 15, 2026

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహణ.

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేర్పునకు అవగాహన ర్యాలీ – హెచ్‌ఎం అనితకు సర్పంచ్ సన్మానం.

బోధన్ ప్రతినిధి రాహుల్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా బోధన్ మండలం రాంపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామ స్థాయి “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.

 

 

ఈ సందర్భంగా గ్రామ వార్డు నుంచి పాఠశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేర్పుల ప్రాధాన్యంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫార్ములు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు వివరించారు.

గ్రామ సర్పంచ్ డోలే సాయికుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.

 

 

కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అనితను గ్రామ సర్పంచ్ శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంటె సాయికుమార్, గ్రామ కార్యదర్శి ఎండీ ఆరీఫ్, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్ శివబాయి, కంటె రేణుక, యెన్నం సాయిలు, పాఠశాల విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.