Telangana newsJune 16, 2026
Telangana news

పిల్లలకు యోగా, సమతుల్య ఆహారంపై అవగాహన కార్యక్రమం.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  June 16, 2026

పిల్లలకు యోగా, సమతుల్య ఆహారంపై అవగాహన కార్యక్రమం.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ కులకర్ణి :-  అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) ముందస్తు కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి ఉన్నత పాఠశాలలో “పిల్లల కొరకు యోగా – ఆరోగ్యకర జీవనశైలి, సమతుల్య ఆహారం” అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ ఆదేశాల మేరకు బాన్సువాడ ఆయుష్ విభాగం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ప్రభుత్వ యునాని వైద్యశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

 

 

ఈ సందర్భంగా యోగా గురువు వొట్లం శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులకు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే పలు యోగాసనాలను అభ్యసింపజేశారు. ఆరోగ్యకర జీవనశైలికి అవసరమైన క్రమశిక్షణ, సమయపాలన, వినయం వంటి విలువలను వివరించారు. మానసిక ఒత్తిడిని తగ్గించి జ్ఞాపకశక్తిని పెంపొందించే ప్రాణాయామ విధానాలను తెలియజేస్తూ స్వస్థ దినచర్య ప్రాముఖ్యతను వివరించారు.

 

 

అలాగే సమతుల్య ఆహారం అవసరాన్ని వివరిస్తూ చిరుతిళ్లు, స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీములు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, డ్రైఫ్రూట్స్ వంటి పోషకాహారాన్ని తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దుర్గాబాయి మాట్లాడుతూ విద్యార్థులు యోగా, ప్రాణాయామం, ధారణ, ధ్యానం వంటి సాధనలను నిత్య జీవితంలో భాగంగా చేసుకొని ప్రతిభావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంగోపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి హన్మవ్వ, అంగన్‌వాడీ కార్యకర్త జమునారాణి, ఆశా కార్యకర్తలు సునీత, శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.