Telangana newsAugust 6, 2026
Telangana news

వర్ని కల్లు దుకాణాల్లో మైనర్లకు కల్లు విక్రయాలపై ఆరోపణలు.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  August 6, 2026

వర్ని కల్లు దుకాణాల్లో మైనర్లకు కల్లు విక్రయాలపై ఆరోపణలు.

వర్ని ప్రతినిధి చందర్ :- నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న కల్లు దుకాణాల సముదాయంలో ప్రభుత్వ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం 21 సంవత్సరాల లోపు వారికి కల్లు విక్రయించడం నిషేధం. ఈ మేరకు దుకాణాల ముందు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని కొందరు వ్యాపారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 

 

 

వ్యాపార లాభాలే లక్ష్యంగా మైనర్ బాలలకు కూడా కల్లు విక్రయిస్తున్నారని, ప్రభుత్వ ఆబ్కారీ చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టాలు అమలులో ఉన్నాయా లేక కేవలం బోర్డులకే పరిమితమయ్యాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మైనర్లకు మత్తు పానీయాల విక్రయం వారి ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ కొందరు దుకాణాల యజమానులు నిబంధనలను విస్మరించి విక్రయాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 

 

ఈ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులు వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత దుకాణాల యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.