మున్సిపల్ కార్యాలయం ఎదుట ఘనంగా 140వ మే డే వేడుకలు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట ఘనంగా 140వ మే డే వేడుకలు.

బోధన్ మండలం ప్రతినిధి రాహుల్:- బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ (బీఎల్టీయూ) ఆధ్వర్యంలో 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

 

 

ఈ సందర్భంగా బోధన్ డివిజన్ బీఎల్టీయూ అధ్యక్షుడు దాల్మల్క పోశెట్టి ఎర్రజెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మే డే రోజును వేతనంతో కూడిన అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

 

1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం పోరాడిన కార్మికుల త్యాగాల ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు అనేక హక్కులు లభించాయని పేర్కొన్నారు. భారతదేశంలోనూ తొలి ట్రేడ్ యూనియన్ నాయకుడు నారాయణ మేఘజీ లోకండే కార్మిక హక్కుల కోసం చేసిన పోరాటాలను స్మరించారు.

 

 

 

దేశంలో కార్మిక వర్గంలో మెజారిటీగా బహుజన శ్రామిక వర్గాలే ఉన్నప్పటికీ, వారికి తగిన రక్షణ, సంక్షేమం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు అమలు చేస్తూ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు.

 

 

తెలంగాణలో అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేయాలని, మే డే స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు.

 

 

ఈ కార్యక్రమంలో జిల్లా బీఎల్టీయూ నాయకులు టి. సంజయ్, నరేందర్, లాలు, గణేష్, అలాగే కార్మికులు లక్ష్మి, సాయిలు, రేఖ, ఎల్లయ్య, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.