వదిలివేసిన శిశువుపై వైద్య సిబ్బంది మమకారం – భావోద్వేగ వీడ్కోలు.

వదిలివేసిన శిశువుపై వైద్య సిబ్బంది మమకారం – భావోద్వేగ వీడ్కోలు.

బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్:-  కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో తల్లిదండ్రులు వదిలివెళ్లిన ఒక పసికందుపై బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది చూపిన మమకారం అందరి హృదయాలను కదిలించింది.

 

 

వారం క్రితం మదీనా కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును వదిలివెళ్లగా, స్థానికులు శిశువును రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు శిశువును బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

 

ఆ రోజు నుంచి ఆసుపత్రి నర్సులు, వైద్య సిబ్బంది ఆ పసికందును తమ కన్నబిడ్డలా చూసుకున్నారు. సమయానికి పాలు పట్టించడం, వైద్యం అందించడం, నిద్రపుచ్చడం వంటి అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఎంతో ఆప్యాయతగా సంరక్షించారు. దీంతో శిశువుపై సిబ్బందికి అపారమైన మమకారం ఏర్పడింది.

మంగళవారం శిశు సంరక్షణ శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయ్ కుమార్ నుంచి శిశువును అధికారికంగా స్వీకరించారు. వారం రోజులుగా తమ కళ్ల ముందే పెరిగిన పసివాడు దూరమవుతుండటంతో నర్సులు, సిబ్బంది భావోద్వేగానికి గురై కన్నీళ్లతో వీడ్కోలు పలికారు.

 

ఈ హృద్యమైన దృశ్యం అక్కడున్న వారందరినీ కలచివేసింది.