తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ సమీక్ష.
హైదరాబాద్ ప్రతినిధి: ఈ నెల 10న తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన ఆయన, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధాని పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు.
భద్రతా చర్యల విషయంలో పోలీసు శాఖకు బ్లూ బుక్ ప్రోటోకాల్ ప్రకారం కట్టుదిట్టమైన భద్రత, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మరియు బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఫైర్ సర్వీసెస్ శాఖకు బేగంపేట్ ఎయిర్పోర్ట్, హెలిప్యాడ్లు మరియు కార్యక్రమ ప్రాంగణాల్లో తగిన అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖకు అవసరమైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రధాని కాన్వాయ్ మార్గాలను పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ శాఖలు పరిశీలించి అవసరమైన మరమ్మతులు తక్షణమే పూర్తి చేయాలని తెలిపారు. విద్యుత్ శాఖకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించాలని ఆదేశించారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి డీజీపీ సి.వి. ఆనంద్, స్పెషల్ సీఎస్‌లు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, దానా కిషోర్, వాణి ప్రసాద్, హోమ్ సెక్రటరీ శిఖా గోయల్, ఇంటెలిజెన్స్ ఏడీజీ అనిల్ కుమార్, పోలీస్ కమిషనర్లు సజ్జనార్, రమేశ్, సుమతి, ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, సైబరాబాద్ కమిషనర్ సృజన, మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.
