బాస్ఫ్ హైదరాబాదులో రెండు జీసీసీలు ఏర్పాటు – 3,000 ఉద్యోగాల అవకాశం.

బాస్ఫ్ హైదరాబాదులో రెండు జీసీసీలు ఏర్పాటు – 3,000 ఉద్యోగాల అవకాశం.

హైదరాబాద్: ప్రపంచంలో ప్రముఖ కెమికల్ కంపెనీ బాస్ఫ్ (BASF) హైదరాబాద్‌లో రెండు గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (GCCs) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్ ఏర్పాటు కోసం కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) సమర్పించింది.

 

 

ఈ LoI ను తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ సర్వేశ్ సింగ్‌కు టోబియాస్ డ్రాట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ పాల్గొన్నారు.

 

 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 100 GCCలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వీటి ద్వారా సుమారు లక్ష మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

 

 

 

హైదరాబాద్‌ను కేవలం ఆఫీస్ హబ్‌గా కాకుండా గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంజినీరింగ్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దిశగా AIKAM, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, 200 ఎకరాల AI సిటీ, క్వాంటం హబ్, వన్ బయో ల్యాబ్ వంటి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వివరించారు.

 

 

160 ఏళ్ల చరిత్ర కలిగిన బాస్ఫ్ 200కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, 1.08 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉందని మంత్రి తెలిపారు. సుమారు రూ.5 లక్షల కోట్ల వార్షిక ఆదాయం కలిగిన ఈ సంస్థ పెట్టుబడులను హైదరాబాద్‌కు తీసుకురావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.

 

 

 

నివేదిక ప్రకారం, ఇప్పటికే ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్, వాంగార్డ్, ఎలి లిల్లీ, మారియట్ వంటి గ్లోబల్ సంస్థలు హైదరాబాద్‌లో GCCలను ఏర్పాటు చేయడం నగరానికి అంతర్జాతీయ గుర్తింపును మరింత బలపరిచిందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో బాస్ఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలెగ్జాండర్ గెర్డింగ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.