బోధన్ నర్సింగ్ స్కూల్‌కు ప్రత్యేక భవనం, హాస్టల్ సౌకర్యం కల్పించాలి – ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్.
నిజామాబాద్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రత్యేక భవనం మరియు ఆధునిక హాస్టల్ వసతి కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ భుజంగరావును ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ, బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోనే నర్సింగ్ స్కూల్‌ను తగిన వసతులు లేకుండా నిర్వహించడం దారుణమని అన్నారు. వర్షాకాలంలో విద్యార్థులకు చదువుకునేందుకు సరైన ఆశ్రయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్టల్‌లో కనీస సౌకర్యాలు లేకుండా ఒకే చిన్న గదిలో సుమారు 17 మంది విద్యార్థినులు ఉండాల్సి వస్తోందని, మొత్తం 70 మంది విద్యార్థులకు సరిపడా గదులు కూడా లేవని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు పేర్కొన్నారు. విద్యార్థుల స్టైఫండ్‌తోనే హాస్టల్ నిర్వహణ కొనసాగుతుండటం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

బోధన్ నర్సింగ్ స్కూల్ కోసం మూడు ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తామని గతంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ కోరింది. అలాగే ఆసుపత్రిలో మేల్, ఫీమేల్ సర్జికల్ వార్డులు, కార్డియాలజీ, ఐసీయూ విభాగాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.
విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం బోధన్ ఆసుపత్రి నుంచి నిజామాబాద్ జీజీహెచ్ వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కూడా డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు వెంటనే నర్సింగ్ స్కూల్‌ను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించాలని ఎస్‌ఎఫ్‌ఐ కోరింది.
అధికారులు తక్షణమే స్పందించకపోతే విద్యార్థుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, కమిటీ సభ్యులు సుజిత్, అక్షయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
