ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్.
రంగారెడ్డి ప్రతినిధి వినోద్ : రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షురాలిగా నియమితులైన చిగురింత పారిజాత నర్సిరెడ్డి గురువారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణలు, పార్టీ శ్రేణుల కోలాహలం మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షురాలు పారిజాత నర్సిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేందుకు పారిజాత నర్సిరెడ్డి నాయకత్వం ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం నూతన డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత నర్సిరెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తల సహకారంతో సమష్టిగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, చల్లా నరసింహారెడ్డి, పట్నం సునీత మహేందర్రెడ్డి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి, సరిత, తిరుపతయ్య, చరణ్, కౌశిక్ యాదవ్, రఘునాథ్ యాదవ్, కాల్వ సుజాత, సామ రామ్మోహన్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన డీసీసీ అధ్యక్షురాలు పారిజాత నర్సిరెడ్డిని నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
