పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు పరామర్శ
రంగారెడ్డి ప్రతినిధి వినోద్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన నవతెలంగాణ రిపోర్టర్ పల్నాటి జగన్ గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని టీపీసీసీ సభ్యుడు, ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
జగన్ మరణవార్త తెలుసుకున్న ఆయన నోముల గ్రామానికి చేరుకుని పార్థివదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, పల్నాటి జగన్ నిత్యం మంచాల మండల ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వార్తలు అందించేవారని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, నిజాన్ని నిర్భయంగా తన కలం ద్వారా సమాజానికి తెలియజేసిన జర్నలిస్టు అని కొనియాడారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన ఆయన మరణంతో జర్నలిస్టు రంగానికి, మంచాల మండలానికి తీరని లోటు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాటి జగన్ కలం మూగబోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.
