చిట్యాలలో గ్రావెల్ తవ్వకాలకు ప్రభుత్వ అనుమతులు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్ నాగయ్య.

రంగారెడ్డి ప్రతినిధి వినోద్ : ఫరూఖ్‌నగర్ మండలం చిట్యాల గ్రామంలో జరుగుతున్న మట్టి తవ్వకాలపై నెలకొన్న వివాదానికి సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 212లో క్వార్ట్జ్ ఫెల్డ్స్‌పార్ మైనింగ్ లీజులో అదనపు ఖనిజంగా గ్రావెల్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు గనులు, భూగర్భ శాఖ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ లీజు 2038 జనవరి 4 వరకు అమల్లో ఉన్నట్లు అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు, గ్రామంలో జరుగుతున్న తవ్వకాలపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోరగా ఫరూఖ్‌నగర్ తహసీల్దార్ నాగయ్య మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతుల పరిధి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తవ్వకాలు జరగాలని స్పష్టం చేశారు.

అయితే మంజూరైన అనుమతుల మేరకే తవ్వకాలు జరుగుతున్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.