సీసీటీవీ ఫుటేజీ పరిశీలన.. నిందితుడిని గుర్తించేందుకు పోలీసుల దర్యాప్తు.
రంగారెడ్డి ప్రతినిధి వినోద్: ఇబ్రహీంపట్నం పట్టణంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం పట్టణానికి చెందిన ఐతా రాజు అనురాధ (40) మంగళవారం సాయంత్రం తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, పట్టణంలోని మార్చురీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న సుమారు 2.5 తులాల బంగారు మంగళసూత్రాన్ని ఒక్కసారిగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను సేకరిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓ ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, అవసరమైన వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఘటనపై కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారైన నిందితుడిని త్వరలోనే గుర్తించి పట్టుకునేందుకు ఫ్యూచర్ సిటీ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.
