చదరంగంలో ప్రతిభకు పట్టం.. సాయి సామల చెస్ అకాడమీ విద్యార్థులకు ఘన సన్మానం.

చదరంగంలో ప్రతిభకు పట్టం.. సాయి సామల చెస్ అకాడమీ విద్యార్థులకు ఘన సన్మానం.

బోధన్ ప్రతినిధి రాహుల్‌: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సాయి సామల చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోశాల ఆర్య సమాజ్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

 

 

 

ఈ కార్యక్రమానికి విద్యా వికాస్ కళాశాల అధినేత శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అకాడమీ కోఆర్డినేటర్ సాయిబాబా సామల, శ్రీనివాస్‌ను పుష్పగుచ్ఛంతో సత్కరించి శాలువా కప్పారు. జిల్లా స్థాయి పోటీల్లో అండర్-17 విభాగంలో రిష్విక్ బొర్రోల్లా ఛాంపియన్‌గా, గౌరాంగ్ అశోక్ రన్నరప్‌గా నిలిచారు. అండర్-13 విభాగంలో గౌరాంగ్ అశోక్ ఛాంపియన్‌గా నిలిచారు. విజేతలను శ్రీనివాస్ శాలువాలతో సన్మానించి అభినందించారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు సామల సాయి సుహాస్, మాదయ్యగారి హితేంద్ర, ల్యాడ్లీ బ్రహ్మిణి అర్హత సాధించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. చెస్ ద్వారా ఏకాగ్రత, ఓపిక, ముందుచూపు, వ్యూహాత్మక ఆలోచన పెంపొందుతాయని తెలిపారు. విజేతలు, అకాడమీకి నగదు బహుమతులు ప్రకటించి, వాటిని సెప్టెంబర్ 5న విద్యా వికాస్ కళాశాలలో అందజేస్తామని తెలిపారు.

 

 

 

అకాడమీ కోచ్, కోఆర్డినేటర్ సాయిబాబా సామల మాట్లాడుతూ విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల సహకారం, క్రమశిక్షణ, నిరంతర సాధన కీలకమని అన్నారు. బోధన్ నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత మంది చెస్ క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ అకాడమీ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, మీడియా ప్రతినిధులు, చెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.