పోచారం భాస్కర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలి.
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై వ్యక్తిగత విమర్శలు సరికాదన్న బీఆర్ఎస్ నాయకులు.
వర్ని ప్రతినిధి చందర్:- నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని తగిలేపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మైసం వెంకన్న భూ వివాదానికి సంబంధించిన హత్య ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడం రాజకీయ సంస్కృతిని దిగజార్చే చర్యలని మండిపడ్డారు.
వర్ని మండల కేంద్రంలో జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాజిరెడ్డి గోవర్ధన్ దిష్టిబొమ్మ దహనం చేసి, రోడ్డుపై ధర్నా నిర్వహించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. రాజకీయంగా విమర్శలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, వ్యక్తిగత దూషణలకు దిగడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

బాజిరెడ్డి గోవర్ధన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోచారం భాస్కర్‌రెడ్డితో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
రాజకీయ విభేదాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శలు చేసుకోవాలని, వ్యక్తిగత దూషణలు, దిష్టిబొమ్మల దహనం వంటి చర్యలకు పాల్పడటం సమంజసం కాదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. బాజిరెడ్డి గోవర్ధన్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బాధ్యులపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ పరిణామాలతో వర్ని మండలంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతుండటంతో స్థానికంగా రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
