అర్హులైన పట్టభద్రులకు సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి.
రంగారెడ్డి మహేశ్వరం ప్రతినిధి వినోద్ : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాను కొత్తగా రూపొందిస్తున్నందున గతంలో ఓటరుగా నమోదు చేసుకున్న వారు సైతం తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. అర్హులైన పట్టభద్రులు 2026 నవంబర్ 6వ తేదీలోపు ఆన్లైన్లో లేదా సంబంధిత ఎన్నికల అధికారుల వద్ద ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీపంలోని మీ-సేవ కేంద్రాన్ని లేదా స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని కోరారు.
అర్హత ప్రమాణాలు: 2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి లేదా అంతకుముందే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందిన పట్టభద్రులు, ఇతర ఎన్నికల నిబంధనలకు లోబడి ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
పట్టభద్రులందరూ చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే తమ దరఖాస్తులను సమర్పించాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉండాలని సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.
