ప్రజా సమస్యలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సామా మహేందర్ రెడ్డి.

కందుకూరు మండలంలో ట్రాఫిక్ చలాన్లతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని విజ్ఞప్తి.

రంగారెడ్డి ప్రతినిధి వినోద్ :

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ కార్యదర్శి సామా మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో ఆత్మీయంగా మాట్లాడి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

 

ముఖ్యంగా కందుకూరు మండలంలో ట్రాఫిక్ చలాన్ల పేరుతో సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రైతులు యూరియా బస్తాలను తీసుకెళ్లే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడం వంటి సందర్భాల్లో వాహనాల ఫొటోలు తీసి ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయాన్ని వివరించారు.

 

ట్రాఫిక్ నిబంధనలు ప్రజల భద్రతను కాపాడేందుకు ఉండాలే తప్ప, సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉండకూడదని పేర్కొన్నారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడం అత్యంత ముఖ్యమని, ప్రజల పక్షాన తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని సామా మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు.