పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.

అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి ప్రతినిధి వినోద్ : రంగారెడ్డి–మహబూబ్‌నగర్–హైదరాబాద్–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

 

 

జిల్లాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జి సురభి వాణీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు.

 

 

నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదుకు అవసరమైన సమాచారం అందించాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైందని, అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించే దిశగా పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాలని అన్నారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పట్టభద్రులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని పేర్కొన్నారు.

 

 

నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.