రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

కేశంపేట మండలంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన సీపీఐ ఎమ్మెల్సీ

రంగారెడ్డి ప్రతినిధి వినోద్ : తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా రంగారెడ్డి జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని, జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

ఈ మేరకు గురువారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఇప్పలపల్లి, వేముల గ్రామాల్లో ఆయన పర్యటించి ఎండిపోయిన పత్తి, మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి పంట నష్టాలను, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెలికంటి సత్యం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించాలని కోరారు. రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని సమన్వయంతో పోరాడాలని సూచించారు.

 

రాబోయే ఆరు నెలలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వం సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి రేషన్ కార్డుదారునికి ఆరు నెలల పాటు నెలకు 10 కిలోల బియ్యంతో పాటు పప్పు దినుసులు కూడా ఉచితంగా సరఫరా చేయాలని కోరారు.

 

పంటలు పూర్తిగా ఎండిపోయి నష్టపోయిన రైతులకు ఎకరాకు మొక్కజొన్న పంటకు రూ.15 వేలు, వరి పంటకు రూ.30 వేల చొప్పున, ఇతర పంటలకు ఎకరాకు రూ.50 వేల వరకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పంటల సాగు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఏకకాలంలో పూర్తిగా మాఫీ చేయాలని కోరారు.

 

సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించాల్సిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుతో దాని ప్రాధాన్యతను పక్కనపెట్టారని విమర్శించారు. జిల్లాలోని 27 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, వెంటనే రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

ఈ పర్యటనలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజి రవీంద్రాచారి, మాజీ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర సమితి సభ్యులు మనగంటి పర్వతాలు, ఓరుగంటి యాదయ్య, కే. రామస్వామి, ఎం. యాదగిరిరెడ్డి, బుద్ధుల జంగయ్య, టీ. రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కామెడి శేఖర్ రెడ్డి, ఎం. శ్రీనునాయక్, పల్నాటి యాదయ్య, ఎం. ప్రభులింగం, శివకుమార్, పవన్ జవాన్, ఆర్. యాదగిరి, వడ్ల సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.