ఎలికట్టలో తండ్రి, కొడుకులపై కేసు నమోదు.. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా నమ్మించి విక్రయం, ప్రశ్నిస్తే బెదిరింపులు
రంగారెడ్డి ప్రతినిధి వినోద్ : భూమి విక్రయం పేరుతో ఓ వ్యాపారిని రూ.15 లక్షలు మోసం చేసిన ఘటన షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలికట్ట గ్రామానికి చెందిన తండ్రి, కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యాపారి మారబోయిన సదానంద్ (56) ఫిర్యాదు ప్రకారం.. సుమారు మూడేళ్ల క్రితం ఎలికట్ట గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 68, 69, 72, 73, 74, 75లో ఐదు ఎకరాల 19 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 71లోని భూమిని విక్రయిస్తామని సంజీవయ్య, ఆయన కుమారుడు సాయి తనను సంప్రదించినట్లు తెలిపారు.
సదరు భూమి పట్టా భూమి అని నమ్మించడంతో వారి మాటలు విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించినట్లు, ఇందుకు సంబంధించి సంతకాలతో కూడిన రసీదు కూడా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, అనంతరం ఆ భూమి పట్టా భూమి కాదని, వివాదంలో ఉన్న ప్రభుత్వ భూమి అని తెలిసిందని ఆరోపించారు.
ఈ విషయమై నిలదీయగా దుర్భాషలాడటంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఆర్. శ్రీకాంత్ నాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
