బదిలీపై వెళ్లిన 13 మంది పోలీసు సిబ్బందికి ఘన వీడ్కోలు.
బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ :- బాన్సువాడ పోలీస్ స్టేషన్లో గత కొంతకాలంగా విధులు నిర్వహించి వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ అయిన 13 మంది పోలీసు సిబ్బందికి ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా 17-05-2026న బాన్సువాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేక వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.
బాన్సువాడ పట్టణ ఇన్స్పెక్టర్ టి. శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బదిలీపై వెళ్లిన సిబ్బందిని శాలువాలతో సన్మానించి, వారి సేవలను కొనియాడారు. బాన్సువాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన సమయంలో వారు చూపిన క్రమశిక్షణ, అంకితభావం, ప్రజాసేవ పట్ల నిబద్ధత ప్రశంసనీయమని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.
బదిలీపై వెళ్లిన సిబ్బంది తమకు బాన్సువాడలో పనిచేసిన అనుభవాలు ఎంతో మధురంగా నిలిచిపోతాయని, సహచర సిబ్బంది అందించిన సహకారం ఎప్పటికీ మరువలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని బదిలీపై వెళ్లిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
