జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో బాన్స్‌వాడ విద్యార్థుల సత్తా – 21 పతకాలు సాధించిన ఘన విజయం.
వర్ని ప్రతినిధి చందర్: గోవాలో జరిగిన జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్–2026లో బాన్స్‌వాడ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 21 పతకాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో బాన్స్‌వాడ నియోజకవర్గం నుంచి 19 మంది విద్యార్థులు పాల్గొనగా, గోవా, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల క్రీడాకారులతో హోరాహోరీగా పోటీపడి విశేష విజయాలు సాధించారు.
వర్ని మండలానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు విద్యార్థులు ప్రత్యేక ప్రతిభ చూపించారు. బలుసు లాస్య (అండర్–14) కాంస్య పతకం, బలుసు స్నేహ (అండర్–14) రజత పతకం, బలుసు ప్రహిషిత (అండర్–10) బంగారు పతకం సాధించి కుటుంబానికి, గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ విజయానికి విద్యార్థుల కృషి, కోచ్‌ల అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధాన కారణమని నిర్వాహకులు తెలిపారు. జట్టు మేనేజర్‌గా వ్యవహరించిన బాన్స్‌వాడ ఎంఈఓ నాగేశ్వరరావు క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూ జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారని ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

జట్టు విజయానికి సహకరించిన కోచ్‌లు ఆనంద్‌కుమార్ పోతన, బాలరాజు, నరసింహాచారి, రాములు, ఫణీంద్ర, హనుమాన్ సింగ్, ప్రవీణ్‌తో పాటు తల్లిదండ్రులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ విజయం క్రీడాకారుల పట్టుదల, కోచ్‌ల మార్గదర్శనం, తల్లిదండ్రుల సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ క్రీడాకారులను అభినందించారు.
