తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిన సంబరాలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు.
రంగారెడ్డి ప్రతినిధి వినోద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు.
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి, ఐఏఎస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకల్లో వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు, ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీజీవో మహిళా విభాగం చైర్మన్ రేవతితో పాటు శ్రీమతి శాంతి, సైదమ్మ, అనిత తదితరులు కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పూజిస్తూ, పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. మహిళా ఉద్యోగుల సమిష్టి భాగస్వామ్యంతో వేడుకలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
మహిళల పాత్ర కీలకం: ఇన్చార్జి కలెక్టర్ కిరణ్మయి
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు కృషి చేయాలని అన్నారు. సమష్టి కృషితో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగుల మధ్య ఐక్యతను, ఆత్మీయతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల జీవన సంస్కృతిలో విడదీయలేని భాగమని పేర్కొన్నారు.
మహిళలు ఐక్యంగా పాల్గొని సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకలను నిర్వహించడం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని ఆమె అన్నారు.
పాల్గొన్న మహిళా అధికారులు, ఉద్యోగులు
ఈ కార్యక్రమంలో శ్రీమతి పావని, జ్యోతి, వినతి, కవిత, శాంతి, రేఖ, రోజా, ఉదయ, స్వాతి, శైలజ, స్రవంతి, అనిత, విజయశ్రీ తదితర మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు మహిళా ఉద్యోగుల్లో ఐక్యత, ఆనందాన్ని నింపాయి.
