ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే హామీ
రంగారెడ్డి ప్రతినిధి వినోద్ రంగారెడ్డి : ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు రంగారెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లు ఎమ్మెల్యే రంగారెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. తమకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనంతో కూడిన సెలవులు, ప్రమోషన్లు, కనీస వేతనం, డీఏ తదితర డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలను ప్రజా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇప్పటికే ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఆశా వర్కర్ల సమస్యలను కూడా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, ఆశా వర్కర్ల ప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
