శ్రీరాముడిపై వ్యాఖ్యలు.. మంత్రి పై పోలీసులకు ఫిర్యాదు.
బోధన్ ప్రతినిధి రాహుల్:- నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు గురువారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ వెంకటనారాయణకు వినతిపత్రం అందజేశారు.
ఇటీవల హనుమకొండలో నిర్వహించిన రాష్ట్ర మెగా రైతు మేళాలో మంత్రి కొండా సురేఖ “జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయా, పథకాలు వస్తాయా” అంటూ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వెంటనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె ప్రజలకు మరియు భక్తులకు క్షమాపణ చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు కోలిపాక బాలరాజు, గుంత గంగాధర్, హనుమాన్లు చారి, మిర్జాపూర్ అరవింద్, పేర్క వెంకటేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్, స్వప్నిల్, పప్పుల వేణు, దుర్గాప్రసాద్, అనిల్, వినయ్, రాములు, రాజు, పడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
