వర్నిలో రోడ్డు ప్రమాదం – టిప్పర్ ఢీకొని ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గాయాలు.
వర్ని ప్రతినిధి చందర్:- నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ని నుంచి నిజామాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఇసుక టిప్పర్, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం, బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బడాపాడ్ నుంచి బాన్సువాడ వైపు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఇసుక టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులతో పాటు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వర్ని ఎస్సై వంశీకృష్ణ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు.
