ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరి అరెస్టు.
రెండు బైక్లు స్వాధీనం – పోలీసుల ప్రత్యేక బృందం చాకచక్యంగా పట్టివేత.
బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్:- బాన్సువాడ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను బాన్సువాడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ తుల శ్రీధర్ తెలిపారు.
సీఐ వివరాల ప్రకారం, బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సాయికుమార్ (20), నసురుల్లాబాద్ మండలం కామ్షీట్పల్లి గ్రామానికి చెందిన ఏనుగు నరసయ్య (19) వేర్వేరు వాటర్ ప్లాంట్లలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఇటీవల బాన్సువాడ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు గుర్తించారు.
దొంగలను పట్టుకునేందుకు సీఐ తుల శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం బీర్కూర్ చౌరస్తాలో ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు.
పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించగా, వారు తప్పించుకునే యత్నం చేశారు. వెంటనే పోలీసులు వెంబడించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఇటీవల రెండు ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి టీఎస్ 16 ఈసీ 7090, టీఎస్ 16 ఈహెచ్ 8724 నంబర్లతో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్సై నవీన్ చంద్ర, హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, కానిస్టేబుళ్లు పాండురంగ, పృథ్వీరాజ్, సుదర్శన్రావులను సీఐ తుల శ్రీధర్ అభినందించారు.
