ఎత్తొండలో వైభవంగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, కళ్యాణ మహోత్సవం.
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
ఎత్తొండ ప్రతినిధి చందర్ :- నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ రేణుకా పరంజ్యోతి ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం, జమదగ్ని సమేత రేణుకా దేవి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

వేడుకలో వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
