ప్రభుత్వ పాఠశాలలను అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి – బీడీఎస్ఎఫ్ డిమాండ్.

ప్రభుత్వ పాఠశాలలను అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి – బీడీఎస్ఎఫ్ డిమాండ్.

మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వినతి.

బోధన్ ప్రతినిధి రాహుల్‌:- 

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించాలని బహుజన్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీడీఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం బోధన్ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి వినతిపత్రం అందజేశారు.

 

 

 

ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ తల్లారే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు సమస్యల కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పలు బడుల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరుగుదొడ్లు, మూత్రశాలల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.

మధుమలాంచ పాఠశాల వద్ద రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, బీర్ సీసాలు వంటి వ్యర్థాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. వెంటనే ప్రహరీ గోడ నిర్మించి పాఠశాలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయింపు పకడ్బందీగా అమలు చేయాలని బీడీఎస్ఎఫ్ కోరింది.

 

 

అలాగే ఖాళీగా ఉన్న ఎంఈఓ, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు అవసరమైన కిట్లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సమయానికి అందించాలని డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది.

విద్యాశాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పాఠశాలలను తనిఖీ చేసి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి నరేందర్, జిల్లా నాయకులు రాజు, దీపక్, లాలూ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.