ఉద్యమకారుల హక్కుల సాధన కోసం జూలై 20న ‘చలో హైదరాబాద్’.
తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలి: కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ గుప్త.
నిజామాబాద్ ప్రతినిధి రాహుల్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల హక్కుల సాధన కోసం జూలై 20వ తేదీ సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ గుప్త పిలుపునిచ్చారు.
శనివారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేకే కమిటీ నిర్వహిస్తున్న చర్చా వేదికకు తెలంగాణ ఉద్యమ నాయకులు, ఉద్యమకారులకు అధికారికంగా ఆహ్వానం అందిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా చేసిన హామీల అమలు, అలాగే ఉద్యమకారుల హక్కుల సాధనకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక జ్యోతి వద్ద కేకే కమిటీ ఆధ్వర్యంలో ఈ చర్చా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉడుత గంగాధర్ గుప్త తెలిపారు. ప్రభుత్వం ఉద్యమకారులను చర్చలకు ఆహ్వానించిన ఈ చారిత్రాత్మక సందర్భంలో, తమ హక్కులపై తమ గళాన్ని బలంగా వినిపించాల్సిన బాధ్యత ప్రతి ఉద్యమకారుడిపై ఉందన్నారు.
కావున తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చి ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
