ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర.

ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర.

‘హరే రామ.. హరే కృష్ణ’ నామస్మరణతో మార్మోగిన బోధన్ పట్టణం.

బోధన్ ప్రతినిధి రాహుల్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఇస్కాన్ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అశోక్ నిత్యదాస్ ప్రభు, రాధికా మాతాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి హాజరయ్యారు. అచన్‌పల్లి అలివేణి మంగ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథయాత్రను ప్రారంభించారు.

 

 

 

పుష్పాలతో అందంగా అలంకరించిన రథంపై శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి ఊరేగించారు. అచన్‌పల్లి అలివేణి మంగ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపం వరకు సాగింది. రథయాత్ర మార్గమంతా భక్తులు ‘హరే రామ.. హరే కృష్ణ’ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

 

 

 

ఇస్కాన్ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన హరినామ సంకీర్తనలు, చిన్నారుల భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు 1,10,000 కాకినాడ కాజాలను స్వామివారి ప్రసాదంగా పంపిణీ చేశారు. రథయాత్ర మార్గంలో భక్తులు నీరాజనాలు పలికి తమ భక్తిని చాటుకున్నారు. టీటీడీ కళ్యాణ మండపం వద్ద రథయాత్ర ముగిసిన అనంతరం భక్తులకు స్వామివారి మహా అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ రథయాత్ర బోధన్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభను నింపిందని ఇస్కాన్ నిర్వాహకులు తెలిపారు.