హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు బోధన్ విద్యార్థులు.

హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు బోధన్ విద్యార్థులు.

సాయి సామల చెస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు.

బోధన్ ప్రతినిధి రాహుల్‌:-  నిజామాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-13 చెస్ ఛాంపియన్‌షిప్–2026లో బోధన్‌కు చెందిన సాయి సామల చెస్ అకాడమీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి తెలంగాణ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు అర్హత సాధించారు.

 

 

 

జిల్లా స్థాయి బాలుర విభాగంలో బోధన్ ఆచార్య స్కూల్ విద్యార్థి గౌరంగ్ అశోక్ జిల్లా ఛాంపియన్‌గా నిలిచి ప్రథమ స్థానం సాధించాడు. అలాగే జెడ్పీహెచ్‌ఎస్ గోవూర్ విద్యార్థి ఎం. హితేంద్ర, ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాల బోధన్ విద్యార్థి సామల సాయి సుహాస్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

 

 

 

ఈ ముగ్గురు విద్యార్థులు ఆగస్టు 6, 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని ప్రగతి నగర్, మిథిలా నగర్ ఆర్చ్ సమీపంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర అండర్-13 చెస్ ఛాంపియన్‌షిప్–2026లో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంపికైన ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.

 

 

 

ఈ సందర్భంగా సాయి సామల చెస్ అకాడమీ కోచ్, కోఆర్డినేటర్ సాయిబాబా సామల మాట్లాడుతూ, బోధన్ ప్రాంతం నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే చెస్ క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. చెస్ ఓపెనింగ్స్, టాక్టిక్స్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్, నోటేషన్, టోర్నమెంట్ ప్రిపరేషన్ వంటి అంశాల్లో ఆధునిక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఇటీవల నిర్వహించిన చెస్ సమ్మర్ క్యాంప్ ద్వారా విద్యార్థుల్లో చెస్‌పై ఆసక్తి పెరిగి జిల్లా స్థాయిలో విజయాలు సాధించడం సంతోషకరమన్నారు.

 

 

రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన గౌరంగ్ అశోక్, ఎం. హితేంద్ర, సామల సాయి సుహాస్‌లను క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి బోధన్ పట్టణానికి, నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.