కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆపితే ఊరుకోం: బీఆర్ఎస్.
వర్ని ప్రతినిధి చందర్: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించి అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం వర్ని మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో అండగా నిలిచాయని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో అమలైన ఈ పథకాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు హెచ్చరించారు. ఆడబిడ్డల వివాహాలకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేసే లేదా తగ్గించే ప్రయత్నం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నారెడ్ల శ్రీను, నాగభూషణం, గుజ్జ అశోక్, అసిఫ్, ఆనంద్, ప్రవీణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పథకాలను వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా “జై కేసీఆర్.. జై తెలంగాణ” అంటూ నినాదాలు చేశారు.
