చండూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు ఆహ్వానం.

చండూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు ఆహ్వానం.

చండూరు ప్రతినిధి రాము: మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్‌పై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని, అవి నిజమని తేలితే తన పదవికి రాజీనామా చేస్తానని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు సవాల్ చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు చండూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి రావాలని మాజీ ఎమ్మెల్యేను ఆహ్వానించారు.

 

చండూరు మున్సిపాలిటీ ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

 

 

 

చండూరు ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ మేరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో బస్ షెల్టర్ నిర్మాణం ప్రారంభిస్తే, దానిపై కూడా మాజీ ఎమ్మెల్యే అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

 

 

 

తాను వైన్ షాపులు, పండ్ల బండ్ల వ్యాపారులు, ప్రైవేట్ ఆసుపత్రులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను లేదా మున్సిపాలిటీ పాలకవర్గం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

తనపై చేసిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే నిరూపిస్తే చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతానని డాక్టర్ కోడి శ్రీనివాసులు ప్రకటించారు. అదే విధంగా ఆరోపణలను నిరూపించలేకపోతే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.

 

 

 

కాంగ్రెస్ మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షుడు ఐతరాజు మల్లేష్ మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే హోదాకు తగినట్లుగా బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను సహించబోమని అన్నారు. పండ్ల బండి వ్యాపారులు, వైన్ షాపుల నిర్వాహకులు కూడా ఎవరికి ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారని తెలిపారు.

 

 

 

ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, కౌన్సిలర్లు బుషిపాక వాసు, కోడి సుష్మ వెంకన్న, మాజీ సర్పంచ్ కోడిగిరి బాబు, కో-ఆప్షన్ సభ్యులు ఖలీల్, మొగుదాల వెంకన్న, షరీఫ్, మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ కన్నబోయిన నాగరాజు, చేనేత సహకార సంఘం డైరెక్టర్లు ఏలే శ్రీను, జూలూరు వెంకటేశం, పన్నాల లింగయ్య, కారింగు రామ్మూర్తి, బొమ్మరబోయిన వెంకటేశం, పున్న సైదులు, సమీర్, బుషిపాక సురేష్, కారింగు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.