అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణాపై వర్ని పోలీసుల ఉక్కుపాదం.
వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో అర్ధరాత్రి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను వర్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు నాలుగు ట్రాక్టర్లలో రాత్రివేళ ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను వెంబడించి ఒక ట్రాక్టర్‌ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా ట్రాక్టర్లపై కూడా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వెల్లడించారు.
పోతంగల్ సరిహద్దులోని నదీ పరివాహక ప్రాంతాల నుంచి రాత్రివేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించి, వర్ని పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టడంతో అక్రమార్కుల్లో కలకలం మొదలైంది. అనుమతులు లేకుండా రాత్రివేళల్లో ఇసుక తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వర్ని ఎస్‌ఐ వంశీకృష్ణారెడ్డి హెచ్చరించారు.
