చండూర్ మార్కెట్ యార్డులో ధాన్యం చోరీ.. 11 మంది అరెస్ట్.

చండూర్ మార్కెట్ యార్డులో ధాన్యం చోరీ.. 11 మంది అరెస్ట్.

చండూర్ ప్రతినిధి రాము: చండూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో నిల్వ చేసిన ప్రభుత్వ ధాన్యాన్ని చోరీ చేసిన ముగ్గురు నిందితులతో పాటు, వారిని బెదిరించి రూ.5 లక్షలు వసూలు చేసిన మరో ఎనిమిది మందిని చండూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి గురువారం వెల్లడించారు. నిందితుల నుంచి రూ.9.80 లక్షల నగదు, 11 సెల్‌ఫోన్లు, చోరీకి ఉపయోగించిన బొలేరో వాహనం (TS 07 UK 4505)ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 

 

కురంపల్లిలోని మహావీర్ పారాబాయిల్ రైస్ మిల్లు భాగస్వామి తెలుకుంట్ల శ్రీనివాసులు మార్కెట్ యార్డు గోదాంలో నిల్వ ఉన్న ప్రభుత్వ ధాన్యంలో సుమారు 600–700 బస్తాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని పేర్కొంటూ ఈ నెల 22న చండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తులో ట్రేడ్ లైసెన్స్ కలిగిన A-1 నాగిళ్ల ఆంజనేయులు తన వద్ద ఉన్న డూప్లికేట్ తాళంతో A-2 బొమ్మోజు ప్రకాష్, A-3 మెతరి నాగేష్‌ల సహాయంతో రాత్రి వేళల్లో గోదాంలోని ధాన్యాన్ని చోరీ చేసినట్లు వెల్లడైంది. అనంతరం చోరీ చేసిన ధాన్యాన్ని సూర్యాపేట మార్కెట్‌లో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

 

 

ఇదిలా ఉండగా, జూలై 18న నిందితులు ధాన్యాన్ని వాహనంలో లోడ్ చేస్తుండగా A-4 నుంచి A-11 వరకు ఉన్న ఎనిమిది మంది గమనించినట్లు పోలీసులు తెలిపారు. చోరీ విషయం బయటపెడతామని, చంపేస్తామని బెదిరించి A-1 వద్ద నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. A-12గా ఉన్న నల్ల స్వామి ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు తీసి బెదిరింపులకు సహకరించినట్లు తెలిపారు. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని వెల్లడించారు.

 

 

ఈ కేసులో నాగిళ్ల ఆంజనేయులు, బొమ్మోజు ప్రకాష్, మెతరి నాగేష్‌లను ధాన్యం చోరీ నిందితులుగా, దోటి వెంకన్న, వేముల పవన్, దోటి శివ, భీమనపల్లి గణేష్, దోటి నరేష్, గండూరి మల్లేశ్, బెత వెంకన్న, గోల్కొండ శేఖర్‌లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన నిందితులుగా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును త్వరితగతిన ఛేదించిన చండూర్ సీఐ టి. రాము, ఎస్‌ఐ జె. శివకుమార్‌తో పాటు పోలీసు సిబ్బందిని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.