వెంకన్న హత్యపై న్యాయం అడిగితే కేసులా?
రాజకీయ వక్రీకరణపై కాంగ్రెస్ నేతల ఫైర్.
వర్ని ప్రతినిధి చందర్:- నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మైసం వెంకన్న హత్య ఘటనపై ఆరు మండలాల కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వర్ని చౌరస్తాలో జిల్లా మాజీ డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో, ధర్నా కార్యక్రమాన్ని కొందరు నాయకులు రాజకీయంగా వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా పోతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ వర్గాలకు చెందిన కొందరు స్థానిక నాయకులు ప్రెస్మీట్లు నిర్వహిస్తూ నిరసన కార్యక్రమంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వెంకన్న కుటుంబాన్ని కనీసం పరామర్శించకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని వారు అన్నారు. బాధిత కుటుంబం విషాదంలో ఉన్న సమయంలో రాజకీయ విమర్శలకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. వెంకన్న కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్డెక్కి నిరసన తెలిపితే కేసులు నమోదు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించాలని, న్యాయం కోసం పోరాడుతున్న వారిపై ఆంక్షలు విధించడం సరికాదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. తమ నిరసనను రాజకీయ కోణంలో చూడకుండా వెంకన్న హత్య ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఏనుగు రవీందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ వర్గాలకు చెందిన కొందరు నాయకులు విషప్రచారానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
మైసం వెంకన్న కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆరు మండలాల కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
