హత్య రాజకీయాలు మా నైజం కాదు.. చనిపోయేవారిని సైతం బతికించడమే మా సంస్కృతి: బాజిరెడ్డి గోవర్ధన్.

హత్య రాజకీయాలు మా నైజం కాదు.. చనిపోయేవారిని సైతం బతికించడమే మా సంస్కృతి: బాజిరెడ్డి గోవర్ధన్.

బాన్సువాడ ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారి: హత్య రాజకీయాలు చేయడం తమ అభిమతం కాదని, చనిపోయే వారిని సైతం బతికించడం తమ నైజమని బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాన్సువాడలో నిర్వహించిన సమారంభేరి సన్నాహక సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

 

 

 

వర్ని, కోటగిరి మండలాల్లో జరిగిన ఇద్దరి మృతికి సంబంధించి కొందరు నాయకులు తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బాజిరెడ్డి ఆరోపించారు. వ్యక్తిగతంగా జరిగిన హత్యలు, కక్షలను తనకు ఆపాదించడం సరికాదని, “నేను చనిపోయే వారిని బతికిస్తాను.. చంపడం నా సంస్కృతి కాదు” అని స్పష్టం చేశారు.

తన హయాంలోనే బాన్సువాడ–నిజామాబాద్ డబుల్ రోడ్, నిజాంసాగర్ కెనాల్ లైనింగ్ వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వాటితో అభివృద్ధి పనులు చేసి, ఇప్పుడు కొందరు నాయకులు తామే చేశామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోసం దమ్ముంటే నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు.

 

 

 

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది రోజుల పాటు ‘పోరుబాట’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. బాన్సువాడలో బీఆర్‌ఎస్‌ బలపడుతుండటంతో కొందరు నాయకులకు నిద్ర పట్టడం లేదని, వచ్చే ఎన్నికల్లో బాన్సువాడలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమని బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు.