రూ.20 లక్షల లంచం కేసులో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, మండల సర్వేయర్.

రూ.30 లక్షలు డిమాండ్ చేసి.. చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం.

రంగారెడ్డి ప్రతినిధి వినోద్ :రంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం కేసులో ఇద్దరు రెవెన్యూ అధికారులను పట్టుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు ఈ కేసులో ఏసీబీకి చిక్కినట్లు సమాచారం.

 

వివరాల్లోకి వెళితే.. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం భూమి సర్వే నిర్వహించి, జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే నివేదిక ఇచ్చే విషయంలో ఫిర్యాదుదారుడిని అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేయగా, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది.

 

ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుండగా మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులును ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు వెల్లడించింది. సర్వేయర్ చేతి వేళ్లపై నిర్వహించిన రసాయన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

 

తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకే సర్వేయర్ లంచం తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇద్దరు అధికారులను అరెస్టు చేసి, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించింది.

 

ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయవచ్చు.