ప్రభుత్వ వైఫల్యానికి సాక్ష్యంగా ఎండుతున్న పంట పొలాలు

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది: బీఆర్‌ఎస్ మహేశ్వరం నియోజకవర్గ కార్యదర్శి సామ మహేందర్ రెడ్డి

మహేశ్వరం ప్రతినిధి వినోద్: ముందుచూపు లేని ప్రభుత్వ పాలనతో తెలంగాణ రైతాంగం సాగునీటి కష్టాలను ఎదుర్కొంటోందని బీఆర్‌ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ కార్యదర్శి సామ మహేందర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి కొరత, విద్యుత్ కోతలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ప్రస్తుతం పత్తి, కంది, మొక్కజొన్న, వరి పంటలు కీలక దశలో ఉన్నాయని, ఈ సమయంలో తగినంత నీరు అందకపోవడంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. పచ్చగా కళకళలాడాల్సిన పంట పొలాలు నీరందక ఎండిపోతూ పశువులకు మేతగా మారుతున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

విద్యుత్ కోతలు.. లో వోల్టేజీతో రైతులకు ఇబ్బందులు

ఒకవైపు విద్యుత్ కోతలు, మరోవైపు లో వోల్టేజీ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామ మహేందర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, నాణ్యత లోపాల కారణంగా వ్యవసాయ మోటార్లు దెబ్బతింటున్నాయని, కొన్ని ప్రాంతాల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యుత్ కోతల వల్ల పంటలకు నీరు పెట్టలేని పరిస్థితి నెలకొందని అన్నారు.

 

పెరిగిన పెట్టుబడులు.. రెట్టింపైన రైతుల కష్టాలు

విత్తనాలు, ఎరువుల ధరలు పెరగడంతో సాగు పెట్టుబడులు భారీగా పెరిగాయని, ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేసిన రైతులు అప్పుల భారంతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యాపారులు, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్న రైతులు పంటలను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ సాగునీరు, విద్యుత్ సమస్యల కారణంగా పంటలు ఎండిపోతుండటంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతోందని అన్నారు.

 

సాగునీటి నిర్వహణలో ప్రణాళిక ఏది?

రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో అందుబాటులో ఉన్న సాగునీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం సరైన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని సామ మహేందర్ రెడ్డి సూచించారు. నీటి నిర్వహణలో నిర్లక్ష్యం రైతుల కష్టాలను మరింత పెంచుతోందని విమర్శించారు.

 

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా ఎక్కడ? పంటలను కాపాడేందుకు సమర్థవంతమైన సాగునీటి ప్రణాళిక ఏది? అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న భరోసా ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.

 

కేసీఆర్ పాలనలో రైతులకు అందిన పథకాలు గుర్తుకొస్తున్నాయి

గతంలో కేసీఆర్ పాలనలో రైతులకు అందిన పథకాలు, సాగునీటి సదుపాయాలు, నాణ్యమైన విద్యుత్ సరఫరాను రైతులు గుర్తు చేసుకుంటున్నారని సామ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

 

రైతులకు న్యాయం చేయాలి

పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన రైతులను గుర్తించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణమే సాగునీరు అందించడంతో పాటు, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి, వారికి అండగా నిలవాలని సూచించారు.

 

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని బీఆర్‌ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ కార్యదర్శి సామ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.