ప్రజల వద్దకే పరిపాలన… కూసుమంచిలో సమస్యలపై మంత్రి స్పందన.
ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఆదివారం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి మంత్రి ప్రజల సమస్యలను స్వయంగా స్వీకరించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పారదర్శక పాలనను ప్రజల గడప దాకా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని, ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పాలేరు నియోజకవర్గంలో మండలాలను క్లస్టర్లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్‌ల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, ఇందులో ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. సాదా బైనామా, నిషేధిత భూముల జాబితా, భూ రికార్డులకు సంబంధించిన ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందిస్తున్నామని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఆలస్యం లేకుండా న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రజా దర్బార్‌లలో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రతి సోమవారం గృహనిర్మాణ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ మంజూరు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి వరి, మొక్కజొన్న పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి, వారంలోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు చేశామని, రైతు భరోసా మొత్తాన్ని ఎకరాకు ₹12,000కు పెంచామని గుర్తుచేశారు. సన్నబియ్యానికి క్వింటాల్‌కు ₹500 బోనస్ అందిస్తున్నామని, మే 5 నుంచి 7 వరకు వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
