ఆదిలాబాద్‌లో జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం.
పేదలకు ఉపాధి ఇబ్బందులు లేకుండా 5-8 కి.మీ పరిధిలోనే నిర్మాణాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండో విడతను జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి Ponguleti Srinivasa Reddy తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను మే 21న జరిగే కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.
మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రెవెన్యూ, గృహనిర్మాణ అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి Revanth Reddy నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ గృహ పథకాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు నివసించడానికి ఆసక్తి చూపకపోవడంతో వారి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే, నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు, స్లమ్ ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న పాత గృహ కాలనీలను గుర్తించి నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపును వేగవంతం చేయాలని, ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ పరిధిలో ఇళ్ల స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని స్పష్టం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రభుత్వ భూములపై ఒక్క అంగుళం ఆక్రమణను కూడా సహించబోమని మంత్రి హెచ్చరించారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ Gaddam Prasad Kumar, మంత్రి Duddilla Sridhar Babu తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహ పథకం అమలులో రాజకీయాలకు తావులేదని, పేదరికమే అర్హత ప్రమాణమని వారు పేర్కొన్నారు.
