చేయూత పథకం కింద రూ.4 వేలు ఇవ్వాలి: బీడీ కార్మికుల ధర్నా.
రుద్రూర్ ప్రతినిధి రాహుల్: తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ) ఆధ్వర్యంలో బీడీ కార్మికులు రుద్రూర్ మండల కేంద్రంలో శుక్రవారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అర్హులైన బీడీ కార్మికులందరికీ చేయూత పథకం కింద రూ.4 వేలు వెంటనే అందించాలని వారు డిమాండ్ చేశారు.
అంగడి బజారు నుంచి సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయం వరకు బీడీ కార్మికులు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ మాట్లాడుతూ, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి Revanth Reddy ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన బీడీ కార్మికులందరికీ రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రులు ప్రకటిస్తున్న నేపథ్యంలో, బీడీ కార్మికులకు విధించిన కటాఫ్ డేటును తొలగించి చేయూత పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.

దరఖాస్తులు తీసుకోకపోవడంతో బైఠాయింపు
వ్యక్తిగత దరఖాస్తు ఫారాలు నింపి తీసుకువచ్చిన బీడీ కార్మికుల నుంచి ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఫారాలు స్వీకరించకపోవడంతో, కార్మికులు సమీకృత మండల భవన సముదాయంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. కటాఫ్ డేటు కారణంగా పెన్షన్ అందకపోవడం, బీడీ కార్ఖానాలు సరిగా నడవకపోవడం, ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
“సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రూ.4 వేలు ఇవ్వాలి” అంటూ కార్మికులు నినాదాలు చేశారు. అనంతరం సిబ్బంది ఫారాలు స్వీకరించేందుకు అంగీకరించడంతో ఆందోళన విరమించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శోభ, బుజ్జి, లత, శంకరమ్మ, లక్ష్మీ, గంగామణితో పాటు పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.

