బీడీ కార్మికులకు రూ.4 వేల పింఛన్ ఇవ్వాలి.

బీడీ కార్మికులకు రూ.4 వేల పింఛన్ ఇవ్వాలి.

బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట TUCI ధర్నా.

బోధన్ ప్రతినిధి రాహుల్‌ :-  బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4 వేల పింఛన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో సోమవారం బోధన్‌లో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం ప్రజావాణిలో అధికారులకు డిమాండ్లతో కూడిన వినతిపత్రంతో పాటు వ్యక్తిగత పింఛన్ దరఖాస్తులను సమర్పించారు.

 

 

 

 

ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ మాట్లాడుతూ, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కట్ ఆఫ్ డేట్ తొలగించి బీడీ కార్మికులందరికీ చేయూత పథకం కింద రూ.4 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.2016 పొందుతున్న వారికి కూడా పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని చెప్పినా, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.

ఇటీవల జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రులు ప్రకటిస్తున్నప్పటికీ, క్యాబినెట్ సమావేశంలో ఆ అంశంపై స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. వాట్సాప్ గ్రూపుల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, అధికారులను అడిగితే పైస్థాయి నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్నారని, దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

జూన్ 2 నుంచి అయినా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, ప్రస్తుతం పొందుతున్న వారికి రూ.2016 స్థానంలో రూ.4 వేల పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీడీ కార్మికుల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బోధన్ ఏరియా కమిటీ నాయకులు గంగామణి, లక్ష్మి, ఇంద్ర, పీఓడబ్ల్యూ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకుడు పడాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.