తప్పచబుత్ర పోలీసుల సాహసోపేత చర్యతో కార్మికుడి ప్రాణం రక్షణ.
హైదరాబాద్ ప్రతినిధి:- హైదరాబాద్ నగరంలోని కార్వాన్ ప్రాంతం కుమ్మరవాడి హనుమాన్ ఆలయం సమీపంలో విద్యుత్ మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్న టీజీపీడీసీఎల్ కాంట్రాక్ట్ కార్మికుడు తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే బీసీ-1 పెట్రోలింగ్ విధుల్లో ఉన్న తప్పచబుత్ర పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ బి. సురేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ సురేష్, కార్మికుడు శ్వాస తీసుకోవడం లేదని గుర్తించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీపీఆర్ నిర్వహించారు. ఆయన సమయస్ఫూర్తితో చేసిన సీపీఆర్ కారణంగా బాధితుడికి మళ్లీ శ్వాస, పల్స్ రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
బాధితుడి ప్రాణాలను కాపాడడంలో ‘గోల్డెన్ అవర్’ సమయంలో అందించిన సీపీఆర్ కీలక పాత్ర పోషించిందని వైద్యులు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ బి. సురేష్ చూపిన ధైర్యసాహసం, మానవతా దృక్పథాన్ని స్థానికులు ప్రశంసించారు. ప్రజల భద్రతతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సేవలందించడంలో హైదరాబాద్ సిటీ పోలీస్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
