బోధన్ నుంచే భవిష్యత్ చెస్ ఛాంపియన్ల తయారీ.

బోధన్ నుంచే భవిష్యత్ చెస్ ఛాంపియన్ల తయారీ.

వర్ని ప్రతినిధి రాహుల్: బోధన్ పట్టణంలో చెస్ ఆటపై విద్యార్థుల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. సాయి సామల చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెగ్యులర్ చెస్ శిక్షణ తరగతులకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఆటలో నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారు.

 

 

 

చెస్‌ను కేవలం వినోదాత్మక ఆటగా కాకుండా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిర్ణయ సామర్థ్యం, క్రమశిక్షణ వంటి జీవిత నైపుణ్యాలను పెంపొందించే సాధనంగా విద్యార్థులు భావిస్తున్నారని అకాడమీ నిర్వాహకులు తెలిపారు.

 

 

 

ఈ సందర్భంగా బోధన్‌కు చెందిన విద్యార్థిని జి. గాయత్రి మాట్లాడుతూ, సాయి సామల చెస్ అకాడమీలో చేరిన తర్వాత చెస్‌పై తన ఆసక్తి మరింత పెరిగిందని తెలిపింది. ప్రతి తరగతి కొత్త విషయాలను నేర్పడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందని పేర్కొంది.

 

 

వారానికి నిర్వహించే ప్రాక్టీస్ మ్యాచ్‌లు, టోర్నమెంట్లు పోటీతత్వాన్ని పెంచుతున్నాయని, చదువుతో పాటు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా చెస్ అభివృద్ధి చేస్తుందని చెప్పింది. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లలో పాల్గొని మంచి క్రీడాకారిణిగా ఎదగాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతున్నట్లు వెల్లడించింది.

 

 

 

అకాడమీ కోచ్ సాయిబాబా సామల మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి గ్రాండ్‌మాస్టర్ కావాల్సిన అవసరం లేకపోయినా, చెస్ ద్వారా జీవితానికి అవసరమైన విలువలు, క్రమశిక్షణ, విశ్లేషణాత్మక ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవచ్చన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.

 

 

భవిష్యత్తులో బోధన్ ప్రాంతం నుంచి కూడా ప్రపంచ స్థాయి చెస్ క్రీడాకారులు వెలుగులోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

 

అకాడమీ ప్రత్యేకతల్లో భాగంగా వారానికి మూడు రోజుల పాటు 60 నిమిషాల శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు ప్రతి ఆదివారం వారాంతపు చెస్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రారంభ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

 

పిల్లల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యూహాత్మక ఆలోచన, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి చెస్ ఉత్తమ వేదికగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.