లోక్ అదాలత్‌లో 514 కేసులకు పరిష్కారం.. రూ.1.07 కోట్లకు పైగా సెటిల్మెంట్.
రాజీ మార్గమే రాజమార్గం.. పరస్పర అంగీకారంతో సమస్యల పరిష్కారం సాధ్యం: జడ్జి వరూధిని.
బోధన్ ప్రతినిధి రాహుల్:- న్యాయస్థానాల చుట్టూ తిరిగే శ్రమ, సమయం, ఖర్చును తగ్గిస్తూ పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఉత్తమ వేదిక అని ఐదవ అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ వరూధిని పేర్కొన్నారు.
బోధన్ పట్టణంలోని న్యాయస్థాన సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. న్యాయవ్యవస్థలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కోర్టు ఆవరణలో నాలుగు ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేశారు. ఆయా బెంచీలలో న్యాయమూర్తులు, న్యాయవాదులు కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, సామరస్యపూర్వక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించారు.
ఈ సందర్భంగా మొత్తం 514 కేసులు పరిష్కారమవగా, రూ.1,07,59,258 విలువైన సెటిల్మెంట్లు పూర్తయ్యాయి. మొదటి బెంచ్‌లో జడ్జి వరూధిని, న్యాయవాది మధుసింగ్, రెండో బెంచ్‌లో సీనియర్ సివిల్ జడ్జి కాంచన రెడ్డి, న్యాయవాది మారుతిరావు ఖన్నా, మూడో బెంచ్‌లో జడ్జి పూజిత, న్యాయవాది అజయ్ కుమార్, నాలుగో బెంచ్‌లో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సాయి శివ, న్యాయవాది కళ్యాణి పాల్గొని కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా వివాదాలను త్వరగా, సులభంగా పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తులు ప్రజలకు సూచించారు.
